
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా భూగర్భ జలాలు (Groundwater) అత్యంత లోతుకు పడిపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 324 మండలాల్లో కరువు తరహా పరిస్థితులు (Drought conditions) నెలకొన్నాయని తెలంగాణ భూగర్భ జల శాఖ ప్రభుత్వానికి సమర్పించిన తాజా నివేదికలో వెల్లడించింది.
రాష్ట్రంలో మొత్తం 621 మండలాలు ఉండగా, సగానికి పైగా మండలాల్లో భూ ఉపరితలం నుంచి అత్యంత లోతుల్లో నీటి జాడలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 52 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండగా, 272 మండలాల్లో మధ్యస్తంగా ఉన్నట్లు నివేదికలో వివరించారు. ముఖ్యంగా రంగారెడ్డి, వరంగల్, ములుగు, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, కొత్తగూడెం తదితర 15 జిల్లాల్లోని పలు మండలాల్లో ఈ తీవ్రత అధికంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. గతేడాది సెప్టెంబరులో సరాసరిగా 3.11 మీటర్ల లోతులో ఉన్న జలాలు.. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ఏకంగా 7.52 మీటర్ల లోతుకు పడిపోవడం గమనార్హం.
రాజధానిలో అడుగంటిన జలాలు
హైదరాబాద్ మహానగరం, దాని పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అత్యంత లోతుకు పడిపోయి డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. అమీర్పేట మండలంలో అత్యధికంగా 32.07 మీటర్ల లోతుకు నీరు పడిపోగా.. బాచుపల్లిలో 29.99 మీటర్లు, సికింద్రాబాద్లో 19.74 మీటర్లు, కూకట్పల్లిలో 18.16 మీటర్లు, కుత్బుల్లాపూర్లో 17.77 మీటర్ల లోతులో జలాలు ఉన్నట్లు గుర్తించారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని బండ్లగూడ, గోల్కొండ, ఖైరతాబాద్ ప్రాంతాల్లోనూ ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాలైన భద్రాచలం, ములుగు, గద్వాల జిల్లా అలంపూర్, ఉండవెల్లి లాంటి చోట్ల కూడా భూగర్భ జలాలు అత్యంత లోతుకు వెళ్లిపోవడం రాబోయే నీటి ఎద్దడికి అద్దం పడుతోంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



