
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించిన నిరసన కార్యక్రమంపై పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నిరసనల్లో ఏకంగా 2,873 మంది నేరస్తులు (Criminals) పాల్గొన్నట్లు గుర్తించామని కేంద్రం సంచలన విషయాలు వెల్లడించింది. వీరిలో అనేక మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు స్పష్టం చేసింది.
టెక్నాలజీతో పక్కాగా గుర్తింపు
నిరసనల్లో పాల్గొన్న నేరస్తులను ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) వాహనాలు, రియల్-టైమ్ ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా పసిగట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. అత్యాధునిక టెక్నాలజీ ఆధారంగా నేర చరిత్ర కలిగిన వారిని పోలీసులు గుర్తించారు. పార్లమెంట్ కు సమర్పించిన పత్రంలో క్రైమ్-కుండీ డేటాబేస్ (Crime-Kundi Database) ద్వారా 2,402 మందిని, డోసియర్ రికార్డుల (Dossier Records) ద్వారా మరో 471 మందిని పక్కాగా గుర్తించినట్లు వివరించింది.
హత్యలు, అత్యాచారాల నిందితులు
నిరసనల్లో పాల్గొన్న వారిలో పలు తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. వీరిలో 101 మంది హత్య కేసుల్లో (Murder Cases), 62 మంది హత్యాయత్నం కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అలాగే 284 మంది దోపిడీ (Dacoity), దొంగతనం (Robbery) వంటి నేరాలతో సంబంధం కలిగి ఉన్నారు. అత్యంత దారుణమైన అత్యాచార కేసుల్లో (Rape Cases) నిందితులుగా ఉన్న వారు 61 మంది ఉండగా, పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదైన వారు ఆరుగురు ఉన్నారు. మరో 25 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇతర చట్టాల కింద నమోదైన కేసులు
మరికొందరు నేరస్తులపై ఇతర చట్టాల కింద కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయుధాల చట్టం (Arms Act) కేసుల్లో 229 మందిని, దొంగతనం కేసుల్లో 135 మందిని, కిడ్నాప్ సంబంధిత నేరాల్లో 19 మందిని గుర్తించారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (NDPS) చట్టం కింద నమోదైన కేసుల్లో 67 మంది నిందితులు ఉన్నారు. మొత్తం 1,884 మంది భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ శిక్షాస్మృతి (IPC) మరియు ఇతర ప్రత్యేక చట్టాల కింద నమోదైన వివిధ కేసులకు సంబంధించిన వ్యక్తులుగా వర్గీకరించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




