
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణలో బీసీల రాజకీయ, సామాజిక హక్కుల సాధన కోసం చేపట్టిన బీసీ రాజ్యాధికార పాదయాత్రలో చోటుచేసుకున్న అనుమానాస్పద రోడ్డు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) అధినేత తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలో ఈ ప్రమాదం జరిగిన తీరు తన హత్యకు జరిగిన కుట్రగా అనుమానిస్తున్నట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
లారీతో వాహనాలను ఢీకొట్టిన వైనం
వలిగొండ నుంచి తొర్రూరు హైవే వైపు పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో, మోత్కూర్ మండలంలోని అన్నాజీపురం–తిరుమలగిరి రోడ్డు సమీపంలో ఒక లారీ అత్యంత వేగంగా వచ్చి కాన్వాయ్‌లోని రెండు కార్లను బలంగా ఢీకొట్టిందని తీన్మార్ మల్లన్న తెలిపారు. టీజీ30టీ7596 నంబర్ గల ఈ లారీ.. తన టయోటా ఫార్చునర్ కారును, మరో టాటా ఆల్ట్రోజ్ కారును ఢీకొట్టడంతో సిబ్బందికి, సహచరులకు తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు.
రాజకీయ కుట్ర కోణంలో దర్యాప్తు జరగాలి
తన రాజకీయ కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్న వారు, వెనుకబడిన తరగతుల సాధికారత కోసం తాను చేస్తున్న పోరాటాన్ని అడ్డుకునే ఉద్దేశంతోనే ఈ దాడి చేయించి ఉండొచ్చని మల్లన్న బలమైన అనుమానం వ్యక్తం చేశారు. తనపై నిఘా పెట్టి, ముందస్తు ప్రణాళికతోనే లారీతో హత్యాయత్నానికి పాల్పడినట్లు భావిస్తున్నానని, తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ పోలీసులపై పూర్తి విశ్వాసం ఉంది
ప్రజాప్రతినిధిగా తనకు తెలంగాణ పోలీసుల పనితీరుపై పూర్తి విశ్వాసం ఉందని, ఈ ఘటనపై డీజీపీ స్వయంగా జోక్యం చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు జరిగేలా చూడాలని కోరారు. ప్రమాద స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలు, కాల్ రికార్డింగ్స్, లారీ యజమాని మరియు డ్రైవర్ పూర్తి వివరాలను సేకరించి వాస్తవాలను వెలికితీయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి అశోక్ ముదిరాజ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



