
అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. తొలిదశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) ఈరోజు విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునే గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. గతంలో కనీసం రూ.2 లక్షలు, గరిష్టంగా రూ.20 లక్షలు ఉండగా, ఇప్పుడు గరిష్ట ప్రోత్సాహకాన్ని ఏకంగా రూ.50 లక్షలకు పెంచింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం అప్పుడే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహకాలు
ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు జనాభా ఆధారంగా ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనుంది. 5 వేల లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.15 లక్షలు, 5,001 నుంచి 10 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు ఇస్తారు. 10 వేల కంటే ఎక్కువ జనాభా ఉండి ఏకగ్రీవమైన పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకం అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మూడు దశల్లో ఎన్నికలు..
రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫేజ్-1లో భాగంగా ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుండగా, 4,180 గ్రామాలు, 42,006 వార్డులకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 16న ఫేజ్-2 నోటిఫికేషన్ వెలువడనుండగా.. 4,715 పంచాయతీలు, 47,048 వార్డులకు ఈ నెల 29న పోలింగ్ జరుగుతుంది. ఇక మూడో విడతలో 4,273 సర్పంచ్ స్థానాలకు, 42,794 వార్డులకు నవంబర్ 19న నోటిఫికేషన్ ఇచ్చి, డిసెంబర్ 2న ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



