
నిర్మల్, సూర్య న్యూస్ : తెలంగాణలో రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్‌లో ‘రైతు గర్జన’ భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. కేసీఆర్ (KCR) హయాంలో రైతులకు అందిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ.. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎత్తిచూపారు.
రైతుబంధు, రైతుబీమా రద్దుపై ఆందోళన
గత ప్రభుత్వ హయాంలో దేశమే మెచ్చేలా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, 11 విడతల్లో రూ. 73 వేల కోట్ల రైతుబంధు, రూ. 5 లక్షల రైతుబీమా అందించిన ఘనత కేసీఆర్‌దేనని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుబంధును మూడుసార్లు ఎగ్గొట్టారని, రైతుబీమా పథకాన్ని ఎత్తేశారని ఆరోపించారు. కరెంటు కోతలు, పంట కొనుగోలు కష్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నీటి పంపకాలపై ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్
రాష్ట్రంలో సాగునీటి నిర్వహణపైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. పట్టిసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు వెళ్తుంటే.. కన్నెపల్లి వద్ద కాళేశ్వరం మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదని ప్రశ్నించారు. శ్రీశైలం నీళ్లు కుప్పం వరకు వెళ్తున్నప్పుడు, పాలమూరు రైతుల పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతాంగంపై కక్ష కట్టిన కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగానే ఈ రైతు గర్జన నిర్వహించామని, తెలంగాణలో మళ్లీ రైతు సంక్షేమం, రాష్ట్ర ప్రగతి సాధ్యపడాలంటే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని బీఆర్ఎస్ శ్రేణులు నినదించాయి.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



