
హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు డిజిటల్ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో కామన్ సర్వీసెస్ సెంటర్స్ (CSC) సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పంద పత్రాలను విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సమక్షంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్. విజయ కృష్ణారెడ్డి, సీఎస్‌సీ రాష్ట్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మదన్ మోహన్ రౌత్ సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో డిజిటల్ యుగానికి అనుగుణంగా సాంకేతికత ఆధారిత విద్యను అందరికీ చేరువ చేసేందుకు తమ వర్శిటీ కీలక నిర్ణయాలు తీసుకుంటుందని వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఈ సందర్భంగా తెలిపారు. తాజా భాగస్వామ్యం ద్వారా యూనివర్సిటీ విద్యా కార్యక్రమాలు, డిజిటల్ సేవలు ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల విద్యార్థులకు మరింత చేరువ కానున్నాయని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో తెలంగాణతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల విద్యార్థులకు కూడా నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 12 వేల సీఎస్‌సీ కేంద్రాల ద్వారా యూనివర్సిటీ కోర్సులకు సంబంధించిన సమాచారం, సేవలను విద్యార్థులు నేరుగా పొందే అవకాశం కలుగుతుంది. అంబేద్కర్ వర్శిటీ డిజిటల్ విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకునే దిశగా చేస్తున్న కృషిని ఈ ఒప్పందం మరింత బలోపేతం చేస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. పుష్ప చక్రపాణి, వీసీ ఓఎస్డీ ప్రొఫెసర్ డి. రవీంద్రనాథ్ సోలమన్, సీఎస్సి అధికారులు డాక్టర్ విఘ్నేష్ సొర్నమోహన్, శ్రీనాథ్ సుధాంసు, వివిధ విభాగాల డీన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



