
నల్గొండ, సూర్య న్యూస్ : నల్గొండ జిల్లాలోని కట్టంగూరు మండలాన్ని (Kattangur Mandal) తక్షణమే కరువు మండలంగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ నలగాటి ప్రసన్నరాజ్ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.

వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం కారణంగా జిల్లాలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని డాక్టర్ ప్రసన్నరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు ప్రభుత్వ అసమర్థత, నాణ్యమైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో కట్టంగూరు మండల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. సాగునీరు, తాగునీరు, పశుగ్రాసం కరువై వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యవసాయంపై ఆధారపడిన కూలీలు, చేతివృత్తుల వారి బతుకుతెరువు ప్రశ్నార్థకంగా మారిందని నాయకులు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కట్టంగూరు మండలాన్ని కరువు ప్రాంతంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25,000 చొప్పున పరిహారం చెల్లించడంతో పాటు, ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి పేదలను ఆదుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కట్టంగూరు మండల మాజీ అధ్యక్షుడు ఊట్కూరు ఏడుకొండలు, సీనియర్ నాయకులు గుండాల మల్లేష్ గౌడ్, రైతు సంఘం మాజీ అధ్యక్షుడు చిట్యాల రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ ముప్పిడి యాదయ్య, పాదూరు శశిపాల్ రెడ్డి, తదితర నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



