
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : ఖైదీలను సత్ప్రవర్తన వైపు మళ్లించేందుకు, ముఖ్యంగా మత్తు వ్యసనం నుంచి విముక్తి కల్పించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ (Telangana Prisons) చేపట్టిన ‘నివృత్తి’ కార్యక్రమానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. న్యూఢిల్లీలో జరిగిన 109వ స్కోచ్ సమ్మిట్‌లో ఈ వినూత్న కార్యక్రమానికి గానూ తెలంగాణకు ప్రతిష్టాత్మక స్కోచ్ సిల్వర్ అవార్డు-2026 (SKOCH Award) వరించింది.
న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో శనివారం జరిగిన ఇండియా ఎకనామిక్ ఫోరమ్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ జైళ్ల మరియు కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా ఈ అవార్డును స్కోచ్ లా ఆఫీసెస్ వ్యవస్థాపకుడు రోహన్ కొచ్చర్, గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీఐజీ ఎం.సంపత్ కూడా పాల్గొన్నారు. కాగా, జైళ్ల శాఖ చేపట్టిన రిహాబిలిటేషన్ ప్రాజెక్టుకు స్కోచ్ అవార్డు రావడం వరుసగా ఇది రెండోసారి కావడం విశేషం.
ఖైదీల కోసం ‘నివృత్తి’ కేంద్రాలు
మాదకద్రవ్యాల బారిన పడిన ఖైదీల్లో మార్పు తెచ్చేందుకు జైళ్ల శాఖ నివృత్తి పేరుతో ప్రత్యేక డీ-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, చర్లపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్ సెంట్రల్ జైళ్లతో పాటు హైదరాబాద్‌లోని మహిళా స్పెషల్ జైలులో వీటిని నిర్వహిస్తున్నారు. జైళ్ల శాఖ లెక్కల ప్రకారం.. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 4,200 మంది ఖైదీలకు స్క్రీనింగ్ నిర్వహించగా, 2,126 మందికి ప్రత్యేక విధానం ద్వారా కౌన్సెలింగ్, చికిత్స అందించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా 300 మందిని నిరంతరం ఫాలో-అప్ చేస్తూ వారు తిరిగి సాధారణ జీవితం గడిపేలా తోడ్పాటు అందిస్తున్నారు.
జీవితాల పునర్నిర్మాణమే లక్ష్యం
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డ్రగ్ డిమాండ్ రిడక్షన్, నషా ముక్త్ భారత్ అభియాన్ మద్దతుతో ఈ నివృత్తి కార్యక్రమం అమలవుతోంది. ఈ సందర్భంగా డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ కస్టడీ విత్ కేర్, ట్రాన్స్ఫార్మింగ్ లైవ్స్ అనే తమ విజన్‌కు ఈ అవార్డు దర్పణం పడుతోందని హర్షం వ్యక్తం చేశారు. కేవలం జైలులో ఉన్నప్పుడే కాకుండా, విడుదల తర్వాత కూడా వారిని సత్ప్రవర్తన గల పౌరులుగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



