
సూర్య న్యూస్ డెస్క్ : జపాన్‌లోని నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ సావన్ బర్వాల్ (Sawan Barwal) అద్భుత ప్రదర్శనతో చారిత్రక రజత పతకం సాధించాడు. పురుషుల మారథాన్ విభాగంలో సుదీర్ఘంగా 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ, 42.195 కిలోమీటర్ల ఈ కఠినమైన రేసును 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో పూర్తి చేసి దేశానికి పతకం అందించాడు.
బర్వాల్ నమోదు చేసిన ఈ టైమింగ్ అతని కెరీర్‌లోనే అత్యుత్తమమైనది కావడం విశేషం. ఈ మారథాన్‌లో జపాన్‌కు చెందిన ఇచితాకా యమషితా 2 గంటల 10 నిమిషాల 49 సెకన్లతో రేసును ముగించి స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, చైనా అథ్లెట్ ఫెంగ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. రేసు ఆరంభం నుంచే ముందు వరుసలో కొనసాగిన బర్వాల్.. రేసు చివరి దశలో జపాన్ అథ్లెట్ ముందుకు దూసుకెళ్లినా, తన వేగాన్ని తగ్గించకుండా అద్భుత పోరాట పటిమతో రెండో స్థానాన్ని నిలబెట్టుకుని రజతం ఖాయం చేసుకున్నాడు.
44 ఏళ్ల తర్వాత దక్కిన పతకం
భారత అథ్లెటిక్స్ చరిత్రలో ఈ పతకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆసియా క్రీడల పురుషుల మారథాన్ విభాగంలో భారత్‌కు పతకం రావడం ఇది 1982 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరగా 1982లో ఢిల్లీ వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్ హోసూర్ కుకప్ప సీతారాన్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు సావన్ బర్వాల్ అసాధారణ కృషితో భారత్‌కు మారథాన్ పతకం దక్కింది.
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఈ ఇండియన్ ఆర్మీ అథ్లెట్.. తన కెరీర్ ఆరంభంలో ఎక్కువగా 5000, 10000 మీటర్ల ట్రాక్ ఈవెంట్లలో పాల్గొనేవాడు. ఇటీవలే తన కోచ్ సలహాతో పూర్తిస్థాయి మారథాన్ వైపు అడుగులు వేసిన బర్వాల్, ఏప్రిల్‌లో రోటర్‌డామ్‌లో జరిగిన రేసులో పాల్గొని 48 ఏళ్ల నాటి జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు అదే ఊపులో ఆసియా క్రీడల్లోనూ పతకం సాధించి తన పేరును భారత క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



