
హైదరాబాద్, సూర్య న్యూస్ : టీమిండియా (Team India) హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కోచింగ్ శైలిపై యువ క్రికెటర్ నమన్ ధీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముక్కుసూటిగా ఉండే గంభీర్.. ఆటగాళ్లు సెంచరీ కొట్టినా సంతృప్తి చెందడని, జట్టు గెలిస్తేనే ఆయనకు ఆనందమని నమన్ చెప్పుకొచ్చాడు. ఇటీవల వెస్టిండీస్‌తో సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన నమన్ ధీర్.. తన జాతీయ జట్టు ఎంట్రీ, గంభీర్ కోచింగ్ తదితర విషయాలపై ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో ముచ్చటించాడు.
జట్టు గెలుపే గంభీర్ లక్ష్యం
కొత్త, పాత అనే తేడా లేకుండా జట్టులోని ప్రతి ఆటగాడు తమకంటూ నిర్దేశించిన పాత్రను కచ్చితంగా పోషించాలని గంభీర్ కోరుకుంటాడని నమన్ తెలిపాడు. మైదానంలో స్మార్ట్‌గా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తాడని పేర్కొన్నాడు. “ఒకవేళ మీరు సెంచరీ కొట్టినా సరే.. జట్టు గెలిస్తేనే ఆయన ఆనందిస్తాడు. వచ్చే మ్యాచ్‌లో ఇంకా మెరుగ్గా ఆడాలని ఆశిస్తాడు. అక్కడితో ఆ సవాల్‌ను వదిలేసి కొత్త పోటీకి రెడీగా ఉండాలని చెబుతాడు” అని నమన్ వివరించాడు.
ఊహించని విధంగా టీమిండియాలోకి..
జాతీయ జట్టులోకి తన ఎంట్రీ చాలా వేగంగా జరిగిపోయిందని నమన్ ధీర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. పిలుపు రావడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే అనిపిస్తోందని, వెస్టిండీస్ సిరీస్‌కు ఎంపికవుతానని తాను ఊహించలేదని తెలిపాడు. ఆ విషయం నుంచి బయటకు రావడానికి రెండు రోజులు పట్టిందన్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు నెగ్గిన జట్టులో సభ్యుడిగా ఉండటం సంతోషంగా అనిపించిందని పేర్కొన్నాడు.
ఐపీఎల్లో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటడం వల్లే భారత జట్టులో చోటు దక్కిందని నమన్ స్పష్టం చేశాడు. తాను పోషిస్తున్న ఫినిషింగ్ పాత్ర ఎంతో సవాల్‌తో కూడుకున్నదని, తొలి బంతి నుంచే అటాకింగ్ గేమ్ ఆడటం తనకు ఇష్టమని తెలిపాడు. ప్రశాంతంగా ఉంటూ తెలివిగా నిర్ణయం తీసుకుంటే ఫినిషింగ్ పాత్ర పోషించడం సులువేనని ఈ యువ క్రికెటర్ పేర్కొన్నాడు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



