
కుత్బుల్లాపూర్, సూర్య న్యూస్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు. అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు కొలన్ హన్మంత్ రెడ్డిని సంప్రదించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu) సహకారంతో సిఎం సహాయనిధి నుండి నిధులు మంజూరు చేయించారు.
గురువారం బాచుపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా దూలపల్లికి చెందిన మేఘన డప్పుకు రూ. 30,000, జీడిమెట్ల నివాసి వీరమళ్ళ శ్రీ రాములుకు రూ. 60,000 మంజూరయ్యాయి. అలాగే కుత్బుల్లాపూర్ వాసి సావిత్రి మానెనూర్ కు రూ. 41,000, బహదూర్ పల్లికి చెందిన ఆర్. సతీష్ కు రూ. 55,000 మరియు దూలపల్లికి చెందిన తుడుము రాజ్ కుమార్ కు రూ. 17,500 విలువ గల చెక్కులను హన్మంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి (Kolan Hanmanth Reddy) మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అనారోగ్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.