
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : వాన్‌పిక్ ప్రాజెక్టు పెట్టుబడుల వివాదంలో యూఏఈ కోర్టు డిక్రీ అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, సంబంధిత సంస్థలు ఇప్పటికే జమ చేసిన ఆస్తులు, సెక్యూరిటీతో పాటు అదనంగా రూ.200 కోట్లను రెండు వారాల్లో సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్‌మాల్య బాగ్చి, వీ. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (రాకియా) తరఫున యూఏఈ కోర్టు ఇచ్చిన డిక్రీ ప్రస్తుత విలువ వడ్డీతో కలిపి జూలై 23, 2026 నాటికి రూ.949.96 కోట్లుగా ఉందని కోర్టు పేర్కొంది.
యూఏఈ డిక్రీ, రాకియా వాదన
2008లో ఆంధ్రప్రదేశ్‌లో వాడరేవు, నిజాంపట్నం పోర్టులు, పారిశ్రామిక కారిడార్, విమానాశ్రయం అభివృద్ధి కోసం చేపట్టిన వాన్‌పిక్ ప్రాజెక్టులో రాకియా పెట్టుబడులు పెట్టింది. ఆ నిధులను నిమ్మగడ్డ ప్రసాద్ దారి మళ్లించారని రాకియా యూఏఈ కోర్టులో దావా వేసింది. అక్కడి న్యాయస్థానం వడ్డీతో కలిపి నిధులు తిరిగి చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును భారత్‌లో అమలు చేయాలంటూ రాకియా హైదరాబాద్, రంగారెడ్డి కమర్షియల్ కోర్టులను ఆశ్రయించింది.
ఆస్తుల బదిలీపై కోర్టు పరిశీలన
రాకియా దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. స్పష్టమైన శాశ్వత హామీ లేనందున దాన్ని సాంకేతికంగా కోర్టు ధిక్కరణగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే కంపెనీల పేర్లు మార్చడం, వాటాల బదిలీలు జరుగుతుంటే నిమ్మగడ్డ ప్రసాద్ ఆస్తులను పక్కదారి పట్టిస్తున్నారన్న రాకియా ఆందోళనలో వాస్తవం ఉందని కోర్టు అభిప్రాయపడింది. బాధితులకు కాగితపు తీర్పు మాత్రమే మిగలకుండా ఉండేందుకు అదనంగా రూ.200 కోట్లు జమ చేయాలని ఆదేశించింది.
కమర్షియల్ కోర్టులకు నాలుగు నెలల గడువు
నిమ్మగడ్డ కుటుంబ నియంత్రణలోని సంస్థల ఆస్తుల నుంచి ఈ బకాయిలను వసూలు చేయవచ్చా లేదా అన్న అంశాన్ని హైదరాబాద్, రంగారెడ్డి కమర్షియల్ కోర్టులే నిర్ణయించాలని సుప్రీంకోర్టు తేల్చింది. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎగ్జిక్యూషన్ పిటిషన్ విచారణను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని కింది కోర్టులను ఆదేశించింది. ఈ డిపాజిట్లు ఆ కోర్టుల్లో కొనసాగుతున్న అమలు ప్రక్రియ ఫలితానికి లోబడి ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



