
48 గంటలకు పైగా జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే ప్రత్యేక ఉత్తర్వులు అక్కర్లేదు.. బీహార్ కేసులో జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
సూర్య న్యూస్ డెస్క్ : ఏదైనా కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగులు, సస్పెన్షన్ ఉత్తర్వులు అందే వరకు తాము విధుల్లోనే ఉన్నట్లని భావిస్తే అది పొరపాటే. ఉద్యోగుల సస్పెన్షన్ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక స్పష్టత ఇచ్చింది. కస్టడీలో గడిపిన సమయమే సస్పెన్షన్‌ను నిర్ణయిస్తుందని, దీనికి ప్రత్యేకంగా ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని తేల్చిచెప్పింది. దేశవ్యాప్తంగా లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ డెస్క్ : ఏదైనా కేసులో ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే, ఆ ఉద్యోగి ఆటోమేటిక్‌గా సస్పెండ్ (Suspension) అయినట్లేనని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
బీహార్ ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ కేసులో స్పష్టత
బీహార్‌లోని సమస్తిపూర్ సదర్ ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ విశ్వజిత్ సింగ్‌కు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ స్పష్టత ఇచ్చింది. విశ్వజిత్ సింగ్‌కు మంజూరైన బెయిల్‌ను పాట్నా హైకోర్టు రద్దు చేయగా, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టి ఆయన బెయిల్‌ను పునరుద్ధరిస్తూనే, ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ నిబంధనలపై ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
ఓ కాంట్రాక్ట్ ఉద్యోగికి రావాల్సిన రూ.36,421 బకాయి వేతనాలను విడుదల చేసేందుకు రూ.4,000 లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై విశ్వజిత్ సింగ్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. అరెస్టు తర్వాత ఆయన దాదాపు 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని ధర్మాసనం గుర్తుచేసింది. ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను తర్వాత ఎత్తివేసి, తిరిగి అదే ఆసుపత్రిలో అదే పోస్టులో నియమించడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించిన కోర్టు.. ఈ అంశాన్ని చట్ట ప్రకారం త్వరగా పరిశీలించాలని బీహార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



