
నల్లగొండ: నల్లగొండ జిల్లా పల్లెల్లో గ్రామదేవతల బోనాల సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న జనం తండోపతండాలుగా తరలిరావడంతో ఊర్లల్లో అసలైన తెలంగాణ పండుగ వాతావరణం నెలకొంది.

చండూరు, కాకుల కొండారం, దామెర భీమనపల్లి, వెలమకన్నె, రాంరెడ్డి పల్లి తదితర గ్రామాల్లో డప్పుల దరువులు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల నడుమ మహిళలు తలలపై బోనాలు ఎత్తుకుని ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మకు, ఇతర కులదేవతలకు నైవేద్యం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.

ఊరు వాడ చల్లగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు ఆ దేవతలను మనసారా వేడుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలన్నీ సందడిగా మారాయి.

ఈ వేడుకలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా ఆలయ నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. యువత, మహిళలు ముందంజలో ఉండి పెద్ద ఎత్తున పాలుపంచుకోవడంతో ఈ ఏటి బోనాల ఉత్సవాలు కన్నుల పండువగా సాగి, అత్యంత విజయవంతమయ్యాయి.



🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



