
హైదరాబాద్, సూర్య న్యూస్ : బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. రేపటి నుంచి దేశవ్యాప్తంగా వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు (Banking Services) తీవ్ర అంతరాయం కలగనుంది. తమ పెండింగ్ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగుల సంఘాల సమాఖ్య శుక్రవారం అనగా సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు (Bank Strike) పిలుపునివ్వడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. సమ్మె తర్వాత కూడా వరుస సెలవులు రానుండటంతో ఖాతాదారులు ముందుగానే అప్రమత్తం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.
బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని తక్షణం అమలు చేయాలని, అలాగే పెన్షన్ సమస్యలను పరిష్కరించడంతో పాటు పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకంపై నెలకొన్న అభ్యంతరాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ యూనియన్లు ఈ సమ్మెకు సిద్ధమయ్యాయి. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో లక్షలాది మంది ఉద్యోగులు, అధికారులు విధులు బహిష్కరించనున్నారు.
ఈ సమ్మెను నివారించేందుకు న్యూఢిల్లీలోని చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో ఆర్థిక సేవల విభాగం, కార్మిక శాఖ అధికారులతో యూనియన్ ప్రతినిధులు జరిపిన తాజా చర్చలు విఫలమయ్యాయి. ఐదు రోజుల పని విధానంపై సానుకూల నిర్ణయం తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని బ్యాంక్ యూనియన్లు తేల్చిచెప్పాయి. సమ్మెను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించినా సంఘాలు ససేమిరా అనడంతో శుక్రవారం నాటి సమ్మె యథాతథంగా కొనసాగనుంది.
వరుసగా 4 రోజులు మూత
రేపు సెప్టెంబర్ 11న (శుక్రవారం) సమ్మె కారణంగా బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాతి రోజు సెప్టెంబర్ 12న రెండో శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు. ఇక సెప్టెంబర్ 13న ఆదివారం ఎలాగూ బ్యాంకులు మూతపడతాయి. తర్వాతి రోజు సెప్టెంబర్ 14 (సోమవారం) వినాయక చవితి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు సెలవు ప్రకటించారు.
నిలిచిపోనున్న సేవలు
దీంతో సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ ప్రభావం వల్ల బ్రాంచ్‌లలో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్ వంటి కీలక సేవలు నిలిచిపోనున్నాయి. ఏటీఎంలు, ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ.. బ్యాంకుల్లో భౌతికంగా జరిగే పనుల కోసం సాధారణ ప్రజలతో పాటు వ్యాపార, వాణిజ్య వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. కాగా, కేంద్రం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే సెప్టెంబర్ 28 నుంచి మరో మూడు రోజుల పాటు, ఆపై అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని బ్యాంకు ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



