
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చదివి వినిపించిన సోషల్ మీడియా పోస్ట్‌పై వివాదం ముదురుతోంది. ఆ పోస్ట్ ఒక ఫేక్ ఖాతా నుంచి వచ్చిందని పేర్కొంటూ బీఆర్ఎస్ (BRS) నేతలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంధ్యా రావు పేరుతో ఉన్న ఆ ఎక్స్ ఖాతా నిజమైనదా కాదా అలాగే దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో విచారించాలని వారు పోలీసులను కోరారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ ఖాతా గురించి ప్రస్తావించిన వెంటనే అది డిలీట్ అయిందని పార్టీ నేతలు ఆరోపించారు.
అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక ఎక్స్ పోస్టును సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల నిరసన అనంతరం కేసీఆర్ ఆదేశాలతో దళితులు తిరిగిన ప్రాంతాలను పసుపు నీళ్లతో శుద్ధి చేశారని ఆ పోస్టులో ఉంది. సంధ్యా రావు బీఆర్ఎస్ అనే ఖాతా నుంచి ఈ పోస్ట్ చేసినట్లు సీఎం సభలో చదివి వినిపించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. తమ పార్టీలో అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కానీ సంధ్యా రావు అనే నేత కానీ లేరని వారు స్పష్టం చేశారు. ఆ ఫేక్ ఖాతాను కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ నిర్వహిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
సీఎంపై ప్రివిలేజ్ మోషన్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక ఫేక్ ఖాతా పోస్ట్ ఆధారంగా ముఖ్యమంత్రి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని ఆయన మండిపడ్డారు. ఈ విషయంపై సభలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామని చెప్పారు. ముఖ్యమంత్రి బాధ్యత వహించి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు హరీష్ రావు వెల్లడించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



