
హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Dr BR Ambedkar Open University) 27వ స్నాతకోత్సవంలో (Convocation) ఏకంగా 36,145 మంది విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారని వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఘంటా చక్రపాణి వెల్లడించారు. బుధవారం టూరిజం ప్లాజాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన అక్టోబర్ 7న జరగనున్న స్నాతకోత్సవ ఏర్పాట్లతో పాటు వర్సిటీలో ప్రవేశపెడుతున్న కొత్త కోర్సులు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
జూబ్లీహిల్స్‌లోని వర్సిటీ క్యాంపస్‌లో ఉన్న భవనం వెంకట్రాం ఆడిటోరియంలో అక్టోబర్ 7వ తేదీన ఉదయం 10:30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. రాష్ట్ర గవర్నర్, వర్సిటీ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేస్తారు. న్యాక్ మాజీ డైరెక్టర్, వర్సిటీ పూర్వ వీసీ ప్రొఫెసర్ వి.ఎస్. ప్రసాద్ స్నాతకోపన్యాసం చేయనున్నారు. ఈ వేడుకలో ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు బి. నరసింగరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు వీసీ చక్రపాణి తెలిపారు.
పతకాల్లో మహిళలదే పైచేయి.. 27 మంది ఖైదీలకు డిగ్రీలు
ఈ స్నాతకోత్సవంలో మొత్తం 36,145 మంది విద్యార్థులు పట్టాలు అందుకోనుండగా, వారిలో 19,800 మంది మహిళలు ఉండటం విశేషం. వివిధ కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొత్తం 38 బంగారు పతకాలను ప్రదానం చేయనున్నారు. ఇందులో మహిళలు ఏకంగా 29 పతకాలు సాధించగా, పురుషులు 9 పతకాలతో సరిపెట్టుకున్నారు. యూజీలో బొజ్జనపల్లి శ్రీ ఆశ్రిత అత్యధికంగా మూడు బంగారు పతకాలు సాధించారు. మరోవైపు ఈ ఏడాది చెర్లపల్లి, రాజమండ్రి, కడప జైళ్ల నుంచి 27 మంది ఖైదీలు డిగ్రీలు అందుకోనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చెందిన ఖైదీ నూకపెయ్యి సురేష్ యూజీలో ఒక బంగారు పతకంతో పాటు బుక్ ప్రైజ్ సాధించడం గమనార్హం.

కొత్తగా 13 కోర్సులు.. నైపుణ్యాభివృద్ధికి ఒప్పందాలు
యూజీసీ అనుమతితో 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఓడీఎల్ విధానంలో ఎనిమిది, ఆన్‌లైన్ విధానంలో ఐదు కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు వీసీ ప్రకటించారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్, టీసీఎస్ అయాన్, కామన్ సర్వీస్ సెంటర్లు తదితర సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. విదేశీ భాషల్లో శిక్షణ కోసం ఏర్పాటు చేసిన కేంద్రాన్ని త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
వంద కోట్లతో బ్రిడ్జ్ కేంద్రం
వర్సిటీ మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని వీసీ కృతజ్ఞతలు తెలిపారు. పాలన, సమానత్వంపై చర్చల కోసం ఎస్సీ సబ్-ప్లాన్ నిధులు వంద కోట్లతో ‘బ్రిడ్జ్’ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే పది కోట్లతో కాంప్రహెన్సివ్ లెర్నింగ్ సెంటర్, పన్నెండు కోట్లతో ల్యాబ్ భవనాలు, ఏడు కోట్లతో ప్రహరీ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. క్యాంపస్‌లో బుద్ధ విగ్రహం, కాక్టస్ గార్డెన్, డిజిటల్ క్లాస్ రూమ్‌లను కూడా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



