
Hyderabad, Surya News: అక్రమ నిర్మాణాల (Illegal Constructions) సమస్యలతో ఇబ్బంది పడుతున్న నగర వాసులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఏళ్ల తరబడి ఎలాంటి పురోగతి లేకుండా నిలిచిపోయిన అనుమతి లేని భవనాల క్రమబద్ధీకరణపై (Building Regularization) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
జీహెచ్ఎంసీ (GHMC) చట్టం స్థానంలో కొత్తగా తీసుకురానున్న క్యూర్-2026 (CURE-2026) బిల్లు ముసాయిదాలో దీనికి సంబంధించి ఒకసారి పరిష్కారం కింద సరికొత్త ప్రతిపాదనలు చేశారు. తగిన జరిమానాతో అనుమతిలేని భవనాలను క్రమబద్ధీకరించేందుకు కమిషనర్లకు పూర్తి అధికారం కల్పించారు.
క్యూర్-2026 బిల్లు అమల్లోకి వచ్చాక యజమానుల నుంచి అఫిడవిట్ రూపంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. దీని ఆధారంగా పాత భవనాలన్నింటినీ క్రమబద్ధీకరించనున్నారు. ఈ కీలక నిర్ణయంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరడంతో పాటు లక్షలాది మంది భవన యజమానులకు (Building Owners) మేలు జరగనుంది.
గతంలో అక్టోబర్ 28, 2015 నాటికి ముందు అనుమతి లేకుండా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు సెప్టెంబరు 2, 2015న ప్రభుత్వం బీఆర్ఎస్ (BRS Scheme) ప్రకటించింది. అప్పట్లో బల్దియా పరిధిలో 1.39 లక్షల దరఖాస్తులు రాగా సుమారు 2,500 కోట్ల మేర ఆదాయం సమకూరింది. అయితే ఈ పథకం అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించేలా ఉందంటూ కొందరు కోర్టును ఆశ్రయించడంతో 11 ఏళ్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
ఇప్పుడు మూడు కార్పొరేషన్ల కోసం రూపొందించిన క్యూర్-2026 చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం పాత బీఆర్ఎస్ పథకానికి ప్రత్యామ్నాయంగా నిబంధనలు చేర్చింది. సెక్షన్-160 ప్రకారం నాటి కటాఫ్ తేదీతో అనుమతి లేని భవనాలను క్రమబద్ధీకరించే అధికారాన్ని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లకు అప్పగించారు.
ఇది పాత దరఖాస్తుదారులకే కాకుండా కొత్తవారికి కూడా వర్తిస్తుంది. ఎవరైనా సదరు భవనాన్ని 2015 కు ముందు నిర్మించామంటూ అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. అయితే తప్పుడు సమాచారంతో (False Information) దరఖాస్తు చేస్తే మాత్రం క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. సరైన మార్గదర్శకాలు లేకపోతే ఇటీవల కట్టిన భవనాలకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు (GHMC Officials) గుర్తుచేస్తున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టమైన విధివిధానాలు వెలువడే అవకాశం ఉంది.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




