
హైదరాబాద్, సూర్య న్యూస్ : దేశవ్యాప్తంగా ఉన్న రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (Regional Rural Banks) భారీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం కాగా, మొత్తం 13,706 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 21వ తేదీతో గడువు ముగియనుంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హతలు, వయోపరిమితి
అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే పోస్టును బట్టి విద్యార్హతలను నిర్ణయించారు. కనీసం ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారితో పాటు ప్రత్యేక పోస్టులకు సీఏ, ఎంబీఏ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తదితర రిజర్వ్‌డ్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం, ముఖ్య తేదీలు
ఈ బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను పలు దశల ద్వారా ఎంపిక చేస్తారు. ముందుగా ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి, అందులో ప్రతిభ చూపిన వారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ, చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపికను ఖరారు చేస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెల నాటికి ఈ నియామక ప్రక్రియ మొత్తం పూర్తి కానుందని స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ ను సందర్శించి దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



