Skip to content

CM Revanth Reddy : ట్రెజరీలతో పనిలేకుండా నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే నిధులు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

Hyderabad, Surya News: తెలంగాణలోని (Telangana) గ్రామపంచాయతీల (Gram Panchayats) బలోపేతం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. పల్లెలకు పూర్తిస్థాయి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం (State Government) అడుగులు వేస్తోంది. గ్రామపంచాయతీలకు వచ్చే సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీ (Treasury) ఖాతాల్లో కాకుండా నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో (Bank Accounts) జమ చేసుకునేలా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలో (Panchayat Raj Act) మార్పులు చేయనున్నారు.

​గత విధానం ప్రకారం పంచాయతీలకు పన్నుల ద్వారా వచ్చే సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాల్లో జమ చేయాల్సి వచ్చేది. దీనివల్ల అత్యవసర పనులు చేపట్టాలన్నా లేదా పారిశుద్ధ్య కార్మికులకు (Sanitation Workers) సకాలంలో వేతనాలు ఇవ్వాలన్నా ఇబ్బందులు ఎదురయ్యేవి. నిధుల విడుదల కోసం సర్పంచులు (Sarpanches) ట్రెజరీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రభుత్వ అనుమతులతో పాటు సాంకేతిక కారణాల వల్ల నిధులు డ్రా చేయడంలో జాప్యం జరిగి అభివృద్ధి కుంటుపడేది.​

ఈ ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి పాత వ్యవస్థకు స్వస్తి పలకాలని నిర్ణయించారు. ఈ నూతన విధానం అమల్లోకి వస్తే గ్రామాల్లో వసూలయ్యే ఆస్తి పన్నులు (Property Tax) మరియు ఇతర రూపాల్లో వచ్చే ఆదాయం నేరుగా పంచాయతీల స్థానిక ఖాతాల్లోనే ఉంటాయి. నిధుల వినియోగంలో సర్పంచులకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ట్రెజరీలతో సంబంధం లేకుండా గ్రామ అవసరాలకు డబ్బులను డ్రా చేసుకునే వీలుంటుంది.​ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంపై స్థానిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల బృందం చట్ట సవరణకు అవసరమయ్యే ముసాయిదాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే ఈ నూతన విధానాన్ని అధికారికంగా అమలు చేయనున్నారు.

మీ అభిప్రాయం తెలియజేయండి.