
హైదరాబాద్, సూర్యా న్యూస్ : తెలంగాణ శాసనసభ (Telangana Assembly) వర్షాకాల సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలిగిస్తున్నారన్న కారణంతో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (BRS Party) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా మొత్తం 22 మంది ఎమ్మెల్యేలను ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.
సభలో తీవ్ర గందరగోళం
సమావేశాల మూడో రోజు ఉదయం సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన నిరసనలు, గతంలో అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు.
శాసనసభ వ్యవహారాల మంత్రి తీర్మానం
ప్రతిపక్ష సభ్యులను శాంతింపజేసేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రయత్నించినప్పటికీ సభలో గందరగోళం సద్దుమణగలేదు. సభను కావాలనే అడ్డుకుంటున్నారని పేర్కొంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందడంతో కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితర 22 మంది సభ్యులను సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
దళిత సభాపతిని అవమానించారన్న డిప్యూటీ సీఎం
సస్పెన్షన్ అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ దళిత వర్గానికి చెందిన స్పీకర్ వ్యవస్థను ప్రతిపక్షం పదే పదే అవమానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా సభ నడవకుండా అడ్డుకోవడం దొరతనం పోకడలకు నిదర్శనమని విమర్శించారు.
గవర్నర్ వద్దకు ప్రతిపక్ష నేతలు
సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. స్పీకర్‌ను కలిసేందుకు వెళ్లిన కేటీఆర్, హరీశ్‌రావులను మార్షల్స్ అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజా సమస్యలపై గళమెత్తకుండా అణచివేసేందుకే ప్రభుత్వం ఈ కుట్ర పన్నిందని విపక్ష నేతలు మండిపడ్డారు. అనంతరం కేటీఆర్, హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం రాజ్ భవన్‌కు వెళ్లి రాష్ట్ర గవర్నర్‌ను కలిసి అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై ఫిర్యాదు చేసింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



