
అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నారు. తొలి దశలో భాగంగా ఉదయం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా.. అనంతరం వార్డులు, డివిజన్ల వారీగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ట్రెండ్స్ ప్రకారం దాదాపు అన్ని చోట్లా కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు.
ప్రధాన నగరాల మేయర్ స్థానాల్లో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. విశాఖపట్నంలో ముక్కా శ్రావణి, గుంటూరులో కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, విజయనగరంలో అవనాపు భార్గవి, చిత్తూరులో కటారి హేమలత, కర్నూలులో విజయ ప్రత్యూష, ఏలూరులో జనసేన మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మరోవైపు, మున్సిపాలిటీల్లోనూ కూటమిదే స్పష్టమైన పైచేయిగా కనిపిస్తోంది. నర్సీపట్నం, పెనుకొండ, వెంకటగిరి, నందిగామ, జగ్గయ్యపేట, నందికొట్కూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, నూజివీడు, మార్కాపురం, ఎమ్మిగనూరు, మాచర్ల, డోన్, బొబ్బిలి, పలమనేరు, పెద్దాపురం, ఇచ్ఛాపురం, పలాస తదితర మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది.
అలాగే.. అమలాపురం, మడకశిర, నరసాపురం, తిరువూరు, గొల్లప్రోలు, సామర్లకోట, తెనాలి, ముమ్మిడివరం, పిఠాపురం, చిలకలూరిపేట, పుత్తూరు, పెడన, పుట్టపర్తి మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ ఆధిక్యంలో ఉండగా.. గిద్దలూరు, ఎలమంచిలి స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు.
పోస్టల్ బ్యాలెట్ల విషయానికొస్తే.. విశాఖపట్నం జీవీఎంసీలో పోలైన మొత్తం 747 ఓట్లలో టీడీపీకి 351, వైసీపీకి 226, ఇతరులకు 170 ఓట్లు దక్కాయి. దీంతో ఇక్కడ కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణికి పోస్టల్ బ్యాలెట్లలో 125 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇక చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో పోలైన 15 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అన్నీ టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి రాజ్కుమార్కే పడటం గమనార్హం.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



