
హైదరాబాద్, సూర్య న్యూస్ : ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా నిలుస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ (KP Vivekanand), మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ (Kuna Srisailam Goud) అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని వారు ఆకాంక్షించారు. టీడబ్ల్యూజేఎఫ్ (TWJF) కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా శనివారం ఆ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నేతలకు శాలువాలు కప్పి సత్కరించారు. నూతన కమిటీ సభ్యులను నేతలు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

జర్నలిస్టుల సంక్షేమానికి అండగా ఉంటాం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమని అన్నారు. సమాజ హితం కోసం నిరంతరం పనిచేసే జర్నలిస్టుల సంక్షేమానికి తన సంపూర్ణ సహకారం ఎల్లవేళలా ఉంటుందని భరోసా ఇచ్చారు. నూతన కమిటీ ఐక్యతతో ముందుకు సాగుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, సమాజానికి సేవలందిస్తున్న వారికి తగిన గుర్తింపు, గౌరవం లభించాలని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం టీడబ్ల్యూజేఎఫ్ చేపట్టే కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.

సీఐ శ్రీధర్ రెడ్డికి సన్మానం
అనంతరం టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పేట్ బషీరాబాద్ సీఐ శ్రీధర్ రెడ్డిని కలిసి శాలువాతో సత్కరించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యే జర్నలిస్టుల సేవలు అభినందనీయమని సీఐ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. కమిటీ సమన్వయంతో ముందుకు సాగుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందించి ప్రోత్సహించాలని టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి అశోక్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు ఏ. గోవిందరావు, కార్యదర్శి పి. బ్రహ్మచారి, ఉపాధ్యక్షుడు ఎం. దివాకర్, సంయుక్త కార్యదర్శి శ్రీశైలం, కమిటీ సభ్యులు కుమార్ గౌడ్, సాయిరాజ్, ప్రవీణ్, సుస్మిత రెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



