
హైదరాబాద్, సూర్య న్యూస్ : పబ్‌లలో మోగే డీజే (DJ) సౌండ్‌కు, సంవత్సరానికి ఒకసారి ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగే దేవుడి ఊరేగింపు భజనకు తేడా గ్రహించకుండా టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ (Allu Sirish) చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీసింది. అర్ధరాత్రి హనుమాన్ ఆలయంలో లౌడ్ మ్యూజిక్ పెడుతున్నారంటూ ఆయన చేసిన ఫిర్యాదుపై పోలీసులు అసలు నిజం తేల్చడంతో నెటిజన్లు శిరీష్‌పై మండిపడుతున్నారు.
షేక్‌పేట్‌లోని తన నివాసానికి సమీపంలో ఉన్న వినోభా నగర్ హనుమాన్ ఆలయంలో రాత్రి 2 నుంచి 3 గంటల వరకు పరిమితికి మించి మ్యూజిక్ ప్లే చేస్తున్నారని శిరీష్ ఇటీవల ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినాయక నిమజ్జనం పూర్తయినా కూడా ఇదే తరహాలో లౌడ్ మ్యూజిక్ పెడుతున్నారంటూ ఆయన వీడియో కూడా షేర్ చేశారు.
నిత్యం నగరంలో వినిపించే పబ్స్, డిస్కోల గోలను వదిలేసి, ఏడాదంతా ప్రశాంతంగా ఉండే ఆలయంపై ఇలా ఫిర్యాదు చేయడమేంటని పలువురు నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన శిరీష్.. తాను కూడా హనుమాన్ భక్తుడినే అని చెబుతూ గతంలో గుడికి వెళ్లిన ఫోటోలను పంచుకున్నారు. రాత్రి 2 గంటల సమయంలో చెవులు బద్దలయ్యేలా డీజే మోగించడం భక్తి అనిపించుకోదని, తాను భక్తిపై కాకుండా సివిక్ సెన్స్‌పై మాత్రమే ఫిర్యాదు చేశానని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.
అయితే, ఈ డీజే మోత వ్యవహారంపై సైబరాబాద్ పోలీసులు విచారణ జరిపి అసలు విషయాన్ని వెల్లడించారు. ఆ అర్ధరాత్రి వినిపించిన సౌండ్ హనుమాన్ టెంపుల్‌ది కాదని, అది గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన కార్యక్రమానిది అని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కనీసం ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో, అది భక్తి భావంతో చేస్తున్న భజనో లేక కేవలం డీజేనో కూడా సరిగా చూసుకోకుండా నేరుగా ఒక ఆలయంపై నిందలు వేయడం తగదంటూ శిరీష్‌కు సోషల్ మీడియాలో నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



