
Hyderabad, Surya News: తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం (Healthcare Sector) సరికొత్త పుంతలు తొక్కుతోందని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి (Prof. Ghanta Chakrapani) కొనియాడారు. సనత్నగర్లో ప్రారంభమైన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS Hospital) అత్యాధునిక సేవలను అందుబాటులోకి తేవడంపై ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలో నిర్మాణంలో ఉన్న మరో మూడు టిమ్స్ (TIMS) ఆసుపత్రులతో పాటు నూతన ఉస్మానియా ఆసుపత్రి భవనం అందుబాటులోకి వస్తే భాగ్యనగరం ఆరోగ్య రంగంలో దేశానికే ఆదర్శ నగరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ (KCR) అయినా, రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అయినా పాలకులెవరైనా ప్రజారోగ్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందనడానికి ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు.
నిజాం పాలన తర్వాత ఆరు దశాబ్దాల పాటు ఒక్క కొత్త సూపర్ స్పెషాలిటీ దవాఖానా కూడా లేని హైదరాబాద్లో ఇప్పుడు ఎయిమ్స్ (AIIMS) తో సహా ఐదు భారీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి రావడం గొప్ప పరిణామమని తెలిపారు. అలాగే వరంగల్ నగరంలో కూడా మరో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిద్ధమవుతోందని గుర్తుచేశారు.
రాష్ట్రంలో గతంలో ఉన్న 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య నేడు 36కు చేరడం, మరో 30 ప్రైవేటు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడం రాష్ట్ర ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు. వైద్యశాలలు, కొత్తగా వస్తున్న ఆసుపత్రులు ప్రజా ఆరోగ్య రంగాన్ని అగ్రగామిగా నిలుపుతాయని చెబుతూ తెలంగాణ ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు. ‘తెలంగాణ వస్తే ఏమొచ్చింది అన్నవాళ్లకు ఇదొక బలమైన సమాధానం’ అని ప్రొఫెసర్ చక్రపాణి అభిప్రాయపడ్డారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



