
హైదరాబాద్, సూర్య న్యూస్ : టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సినీ ప్రయాణం మొదలై నేటికి సరిగ్గా 48 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ (X) వేదికగా (@KChiruTweets) ఒక భావోద్వేగ భరితమైన పోస్ట్‌ను అభిమానులతో పంచుకున్నారు. “ఆ రోజు కొణిదెల శివశంకర వరప్రసాద్ నుంచి ‘చిరంజీవి’గా నేను పెట్టుకున్న పేరు.. నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వత గుర్తింపు” అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 1978 సెప్టెంబర్ 22వ తేదీ తనకు ఎప్పుడూ అత్యంత ప్రత్యేకమైనదని చిరంజీవి వెల్లడించారు.
ప్రాణం ఖరీదుకు 48 ఏళ్లు
నిర్మాత క్రాంతి కుమార్ నిర్మాణంలో, కె.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రం విడుదలై నేటితో 48 ఏళ్లు పూర్తయింది. ఈ సినిమాలో చిరంజీవి ‘నరసింహ’ అనే పాత్రను పోషించారు. ఈ సందర్భంగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, అవకాశాలు ఇచ్చిన నిర్మాతలకు, తనలోని నటుడిని కొత్త కోణాల్లో ఆవిష్కరించిన దర్శకులకు, తెరవెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయాలన్నింటికంటే ప్రేక్షకులు తనపై చూపించిన ప్రేమే గొప్పదని, తనను కుటుంబ సభ్యుడిగా భావించి ఆదరించిన ప్రతి ఒక్క అభిమానికి ధన్యవాదాలు తెలిపారు.
కెమెరా ముందుకు వచ్చింది అప్పుడే..
వాస్తవానికి చిరంజీవి మొదట కెమెరా ఎదుట నిలిచింది ‘పునాది రాళ్లు’ (ఫిబ్రవరి 11, 1978) సినిమా కోసం అయినప్పటికీ, ముందుగా థియేటర్లలోకి వచ్చింది మాత్రం ‘ప్రాణం ఖరీదు’ చిత్రమే కావడం విశేషం. కాగా, ప్రస్తుతం మెగాస్టార్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో-ఫ్యాంటసీ చిత్రం ‘విశ్వంభర’తో పాటు దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్న ‘కాకా’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



