
హైదరాబాద్, సూర్య న్యూస్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి రావడానికి కీలకమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ డిక్లరేషన్ల హామీలను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని సుమారు 10 వేల మంది స్థానిక కాంట్రాక్టర్ల కడుపు కొట్టి, అస్మదీయులకు దోచిపెట్టడమే లక్ష్యంగా తెచ్చిన జీవో నెం 17 (GO 17)ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఘాటైన బహిరంగ లేఖ రాశారు.
హామీలు ఒకట.. చేసేది ఇంకొకటా?
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ (Kamareddy BC Declaration), చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లలో కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పిందని ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) సమక్షంలో హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. పాఠశాల విద్యార్థులకు అందించే నోట్ బుక్స్, యూనిఫాం, ట్రంక్ బాక్సులు, ప్లేట్లు, గ్లాసుల సరఫరా కోసం తెచ్చిన ₹2000 కోట్ల టెండర్లలో స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీ వెండర్లకు ఒక్క శాతం కూడా వాటా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
తెలంగాణ కాంట్రాక్టర్లు పనికిరారా?
గతంలో కేసీఆర్ (KCR) హయాంలో జిల్లా కొనుగోలు కమిటీల ద్వారా స్థానిక కాంట్రాక్టర్లకు పనులు దక్కేవని, ఇప్పుడు కేంద్రీకృత టెండర్ల పేరుతో పక్క రాష్ట్రాల వారికి, కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. టెండర్ ఫీజుల పేరుతో వేల రూపాయలు వసూలు చేయడంపై “ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక సర్కస్ నడిపిస్తున్నారా?” అంటూ నిలదీశారు. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలకు టెండర్లలో రిజర్వేషన్లు ఉన్నాయని, తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేకపోవడం శోచనీయమన్నారు.
ఏప్రిల్ 14 డెడ్ లైన్
రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న జీవో నెం 17ను హైకోర్టు (High Court) ప్రశ్నించినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి (Ambedkar Jayanti) లోపు ఈ “డ్రాకోనియన్” జీవోను రద్దు చేసి, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహాల సాక్షిగా కాంగ్రెస్ నాయకులను నిలదీస్తామని ఆయన హెచ్చరించారు.