
సూర్య న్యూస్ డెస్క్ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తన వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటివరకు కేవలం ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లకు మాత్రమే పరిమితమైన ‘వ్యూ వన్స్’ (View Once) ఆప్షన్‌ను, త్వరలో సాధారణ టెక్స్ట్ మెసేజ్‌లకు కూడా పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ ద్వారా పంపిన టెక్స్ట్ మెసేజ్‌ను రిసీవర్ ఒక్కసారి ఓపెన్ చేసి చదివిన వెంటనే, అది ఆటోమేటిక్‌గా మాయమైపోతుంది. ఆ తర్వాత ఆ మెసేజ్‌ను మళ్లీ చూసే అవకాశం ఉండదు.
ప్రైవసీకి మరింత పెద్దపీట
మల్టీమీడియా వ్యూ వన్స్ ఫీచర్‌లాగే ఈ కొత్త టెక్స్ట్ ఫీచర్ కూడా పనిచేస్తుందని తెలుస్తోంది. వ్యూ వన్స్ ద్వారా పంపిన టెక్స్ట్ మెసేజ్‌ను కాపీ చేసుకోవడానికి, ఫార్వార్డ్ చేయడానికి లేదా స్క్రీన్‌షాట్ తీయడానికి వీలుండదని సమాచారం. అలాగే, ఈ మెసేజ్‌లను సేవ్ చేసుకోవడం, ఇతరులతో షేర్ చేసుకోవడం కూడా సాధ్యపడదు. అయితే, వేరొక ఫోన్‌తో ఆ మెసేజ్‌ను ఫోటో తీసుకునే అవకాశం మాత్రం ఉంటుందని, దాన్ని నిరోధించే ఆప్షన్ ప్రస్తుతానికి ఇందులో లేదని వాట్సాప్ వర్గాలు పేర్కొంటున్నాయి.
త్వరలో అందరికీ అందుబాటులోకి..
ప్రస్తుతం ఈ ‘వ్యూ వన్స్ టెక్స్ట్ మెసేజ్’ ఫీచర్ ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో వివరిస్తూ వాట్సాప్ ఒక వీడియోను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో పూర్తి స్థాయిలో యూజర్లందరికీ ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



