
చెన్నై, సూర్య న్యూస్ :తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు జోసెఫ్ విజయ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా (Chief Minister) ఆదివారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ చారిత్రాత్మక వేడుక జరిగింది. రాష్ట్ర గవర్నర్ సమక్షంలో విజయ్ పదవీ స్వీకార ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమానికి రాజకీయ మరియు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకకు విచ్చేసి విజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. స్టేడియం లోపల, బయట లక్షలాది మంది అభిమానులు తమ అభిమాన నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతుంటే ఆనందంతో నినాదాలు చేశారు.
తొలి సంతకంతోనే సంచలనం
ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన వెంటనే సీఎం విజయ్ నేరుగా పాలనపై తన మార్క్ చూపించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (Free Electricity) పథకానికి సంబంధించిన ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు. పాలనలో సామాన్యుల సంక్షేమమే తన మొదటి ప్రాధాన్యత అని విజయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అలాగే రాష్ట్రంలో మహిళా భద్రతపై (Women Safety) ఆయన రెండో సంతకం చేశారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకునే ఫైల్ పై మూడో సంతకం చేశారు. దశాబ్దాలుగా ఉన్న ద్రావిడ పార్టీల ఆధిపత్యాన్ని కాదని తమిళ ప్రజలు విజయ్ కు పట్టం కట్టడం విశేషం. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. విజయ్ తన క్యాబినెట్ మంత్రులతో కలిసి త్వరలోనే పూర్తిస్థాయిలో పాలనపై సమీక్ష నిర్వహించనున్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



