Skip to content
Home » Tamil Nadu Politics : తమిళనాడులో ఉత్కంఠ.. మొండికేస్తే గవర్నర్ ను తొలగించండి అంటున్న జయప్రకాశ్ నారాయణ్

Tamil Nadu Politics : తమిళనాడులో ఉత్కంఠ.. మొండికేస్తే గవర్నర్ ను తొలగించండి అంటున్న జయప్రకాశ్ నారాయణ్

చెన్నై, సూర్య న్యూస్ : తమిళనాడు రాజకీయాలు (Tamil Nadu Politics) ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే (TVK) పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ఆ పార్టీ అధినేత విజయ్ (Thalapathy Vijay) ను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానించకపోవడం సస్పెన్స్ కు దారి తీసింది. ఈ తాజా రాజకీయ పరిణామాలపై లోక్ సత్తా (Lok Satta) వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తమిళనాడు గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధంగా మరియు అప్రజాస్వామికంగా ఉందని ఆయన విమర్శించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి గవర్నర్ పక్షపాత రాజకీయాలు చేయడం ఏమాత్రం సరికాదని జయప్రకాశ్ నారాయణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అనేది శాసనసభ (Assembly) లో తేల్చాలి కానీ రాజ్ భవన్ లో కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) మరియు రాష్ట్రపతి వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi), హోం మంత్రి అమిత్ షా (Amit Shah) వివేకంతో వ్యవహరించి విజయ్ ను ఆహ్వానించేలా గవర్నర్ కు సలహా ఇవ్వాలని కోరారు. ఒకవేళ గవర్నర్ తన మొండి వైఖరిని ఇంకా కొనసాగిస్తే ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని సూచించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి పక్షపాత చర్యలు వీధి పోరాటాలకు దారి తీస్తాయని జయప్రకాశ్ నారాయణ్ హెచ్చరించారు. పక్క దేశాలలో ప్రభుత్వాల పతనానికి ఇలాంటి పరిస్థితులే కారణం అయ్యాయని ఆయన గుర్తు చేశారు. బలనిరూపణ ద్వారా శాసనసభలో ఓడిపోయేంత వరకూ మైనారిటీ ప్రభుత్వమైనా పాలన సాగించవచ్చని ఆయన పేర్కొన్నారు. గతంలో 1969లో ఇందిరా గాంధీ (Indira Gandhi), 1991లో పీవీ నరసింహారావు (PV Narasimha Rao) లు మైనారిటీ ప్రభుత్వాలను ఎలా నడిపారో ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తమిళనాడు ప్రజలు ఇచ్చిన అసాధారణ తీర్పును అగౌరవపరచడం ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా బలహీనపరుస్తుందని జయప్రకాశ్ నారాయణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.