
నల్గొండ, సూర్య న్యూస్ : తెలంగాణలో మళ్లీ కేసీఆర్ (KCR) పాలన రావాలని ఆకాంక్షిస్తూ ఉమ్మడి నల్గొండ (Nalgonda) జిల్లాకు చెందిన బీఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకులు గుండాల మల్లేష్ గౌడ్ (Gundala Mallesh Goud) ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర (Padayatra) సోమవారం సాయంత్రంతో ముగిసింది. శనివారం నార్కట్‌పల్లి మండలం నకరేకల్ నియోజకవర్గంలోని చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదంతో ప్రారంభమైన ఈ యాత్ర.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వరకు మూడు రోజుల పాటు నిర్విరామంగా కొనసాగింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా మల్లేష్ బృందం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, యాత్ర సాగిన తీరును, జిల్లాలోని ప్రజా సమస్యలను ఆయనకు వివరించారు. ఎంతో ఉత్సాహంగా, దీక్షతో పాదయాత్రను పూర్తి చేసిన మల్లేష్ బృందాన్ని కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

మళ్లీ కేసీఆర్ సీఎం కావాలన్నదే లక్ష్యం
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు, రైతులకు అన్యాయం జరుగుతోందని, ప్రజలకు మేలు జరగాలంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని గుండాల మల్లేష్ గౌడ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. బీఆర్ఎస్ పాలనలో రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, పెన్షన్లు వంటి పథకాలతో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరిందని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆ స్థాయిలో న్యాయం జరగడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ పాలన ఎంతో అవసరమని, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఆయన నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని, వారిలో తాము కూడా ఉన్నామని మల్లేష్ గౌడ్ స్పష్టం చేశారు.

పాదయాత్రలో పాల్గొన్న నాయకులు
ఈ పాదయాత్రలో నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు వడిత్య నాగరాజు నాయక్, తుంగతుర్తి నుంచి మోల్కాపురి శ్రీకాంత్ గౌడ్, మునుగోడు నుంచి బొడ్డు రవి, నల్గొండ జిల్లా టీహెచ్‌ఆర్ సేవా సమితి నాయకులు గోదాల హరీష్ రెడ్డి, నాగన్న, కార్తీక్ రెడ్డి, మహిళా నాయకురాలు గుండాల పావని తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ పాదయాత్రకు నకిరేకల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు ఊటుకూరు ఏడుకొండలు సంఘీభావం తెలిపారు.
ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



